సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సులు వస్తే అందులో కిక్కిరిసి ప్రమాదరక స్థితిలో ప్రయాణించారు. ప్రధానంగా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులుఅవస్థలు పడ్డారు. అదనపు సర్వీసులు నడపాలని గ్రేటర్ ఆర్టీసీ భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా రోజులతో పోలిస్తే సర్వీసుల సంఖ్య మరింత తగ్గింది. తాత్కాలిక సిబ్బందితో ఇప్పటి వరకు 1300 బస్సులు నడపగా... అదికాస్త 1087కుపడిపోయింది. టెంపరరీ డ్రైవర్లు సొంత విధుల్లోకి వెళ్లడంతోఈ పరిస్థితి తలెత్తింది. విద్యాసంస్థల పునఃప్రారంభం సందర్భంగా'సాక్షి' సోమవారం విజిట్ నిర్వహించింది.
ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్, ఒకేషనల్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చేసేది లేక ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. చాలా మంది బైకులపై త్రిబుల్ రైడింగ్ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు వాహనాలు దొరక్క నరకం చూశారు. తిరిగిన ఒకటి, రెండు బస్సుల్లోనూ కిక్కిరిసి వెళ్లారు. దసరా సెలవుల్లో సమ్మె ప్రారంభం కావడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనువుగా ఈ సెలవులను పొడిగించారు. కానీ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన సోమవారం నాటికి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 1087 బస్సులను మాత్రమే రోడ్డెక్కించగలిగింది. మరో 375 అద్దె బస్సులు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. అవి ఏ రూట్‌లో తిరిగాయి.. ప్రయాణికులకు ఎలాంటి సేవలందజేశారనే అంశంపై స్పష్టత లేదు. నగరంలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా కనీసం 2000 బస్సులను నడిపాలి. ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ఆ స్థాయిలో నడపలేకపోయారు. తాత్కాలిక డ్రైవర్లలో చాలామంది తిరిగి తమ సొంత విధుల్లోకి వెళ్లిపోయారు. బస్సులు నడిపేవారు లేక ఘట్కేసర్, బోగారం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, కీసర, బాచుపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయాణ గండం తప్పలేదు.