వహ్‌ తాజ్‌..

 పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌ కూడా వారి వెంట ఉన్నారు. ట్రంప్‌, మెలానియా చేతిలో చేయి వేసుకుని తాజ్‌ అందాలను వీక్షించారు. అనంతరం విజిటర్స్‌ బుక్‌లో సందేశం రాశారు. ‘తాజ్‌మహల్‌ స్ఫూర్తినిస్తున్నది. ఘనమైన, వైవిధ్యమైన భారత సంస్కృతికి ఇది నిదర్శనం. ధన్యవాదాలు భారత్‌' అని వారు అందులో పేర్కొన్నారు. తాజ్‌ చారిత్రక నేపథ్యం, విశిష్టత గురించి గైడ్‌ వారికి వివరించారు. అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రాలోని ఖెరియా ఎయిర్‌బేస్‌ చేరుకున్న వారికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌బేస్‌ నుంచి తాజ్‌మహల్‌ సమీపంలోని అమర్‌విలాస్‌ హోటల్‌కు ట్రంప్‌ వెళ్లే మార్గంలో సుమారు 15,000 మంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ఆయనకు స్వాగతం పలికారు. పలువురు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్‌ సందర్శన నేపథ్యంలో తాజ్‌మహల్‌కు మధ్యాహ్నం నుంచి సందర్శకులను నిలిపివేశారు. సుమారు గంట పాటు ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌ వద్ద గడిపారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ట్రంప్‌ హిందీలో ట్వీట్‌ చేస్తూ.. ‘భారత్‌ను అమెరికా ప్రేమిస్తున్నది. భారత్‌ను అమెరికా గౌరవిస్తున్నది. అమెరికా ప్రజలు భారత ప్రజలకు నిజమైన స్నేహితులు అన్న సందేశమిచ్చేందుకు నేను, ఫస్ట్‌లేడీ (అమెరికా ప్రథమ మహిళ మెలానియా) 8000 మైళ్లు ప్రయాణించి వచ్చాం’ అని పేర్కొన్నారు.